భువనేశ్వర్: పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు, ఒడిశాలోని పూరీకి చెందిన యూట్యూబర్ మహిళతో (Odisha YouTuber) సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జ్యోతితో కలిసి ఆమె కూడా పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఒడిశా పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఆ మహిళ గురించి దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రాతోపాటు పాక్‌కు రహస్య సమాచారాన్ని చేరవేతలో ఆమెకు ఏమైనా సంబంధం ఉన్నదా అన్నది ప్రశ్నిస్తున్నారు. అయితే ఒడిశా యూట్యూబర్ మహిళ వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
కాగా, జ్యోతి తనకు కేవలం స్నేహితురాలని ఆ మహిళ తెలిపింది. యూట్యూబ్ ద్వారానే తమ మధ్య పరిచయం ఏర్పడినట్లు చెప్పింది. పాకిస్థాన్ కోసం జ్యోతి గూఢచర్యం చేస్తున్నదన్న సంగతి తనకు తెలియదని అన్నది. ఈ విషయం తెలిసి తాను షాక్ అయ్యానని చెప్పింది. తనపై ఎలాంటి దర్యాప్తు చేసినా పూర్తిగా సహకరిస్తానని ఆమె తెలిపింది. మరోవైపు తమ కుమార్తె ఇంట్లోనే ఉన్నదని ఆ మహిళ తండ్రి మీడియాకు తెలిపారు. దర్యాప్తు సంస్థలతో తమ కుటుంబం సహకరిస్తున్నదని వెల్లడించారు.