Odisha : ఒడిశాలో దారుణం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో వాటిలోని ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా, భస్మా పోలీస్ స్టేషన్ పరిధిలో కైంత్రా వద్ద, పదో నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైవేపై ఝార్సుగూడ నుంచి సుందర్‌గఢ్ వెళ్తున్న ట్రక్కు అతివేగం కారణంగా అదుపుతప్పింది.
వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో డివైడర్‌ను దాటిన ట్రక్కు ఒకవైపు నుంచి మరోవైపు రోడ్డు మీదికి వెళ్లిపోయింది. దీంతో అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఇలా రెండు ట్రక్కులు ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. అవి పెద్ద ఎత్తున వ్యాపించి, పూర్తిగా అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు ట్రక్కుల్లోని డ్రైవర్లు మంటల్లో సజీవదహనమయ్యారు. వాహనాలు ఢీకొన్న సమయంలో డీజిల్ ట్యాంకర్ పగలడం వల్ల ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. రెండు ట్రక్కులకు పూర్తిగా మంటలు అంటుకున్నాయి. డ్రైవర్లు బయటపడే అవకాశమే లేకపోయింది. ఇది గమనించిన ఇతర వాహనదారులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వచ్చి మంటలను ఆర్పేశారు. కానీ, ఆలోపే ట్రక్కుల్లో ఇద్దరు డ్రైవర్లు కాలిపోయి మరణించారు. మంటల తీవ్రత కారణంగా డ్రైవర్ల మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. ఇంకా డ్రైవర్లను గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.