భువనేశ్వర్: గిరిజన మహిళ పట్ల ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. పొలం ధ్వంసంపై నిరసన తెలిపిన ఆమెను దారుణంగా కొట్టాడు. (Tribal Woman Assaulted) అలాగే బలవంతంగా ఆమె నోట్లో మలం పోశాడు. బాధిత గిరిజన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 16న జూరబంధ గ్రామానికి చెందిన 20 ఏళ్ల గిరిజన యువతి పొలం వద్ద పని చేస్తున్నది. గిరిజనేతర వ్యక్తి ఆ మహిళ వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ నడిపాడు. ఆమె పంటకు నష్టం కలిగించాడు.
కాగా, ఆ గిరిజన మహిళ దీనిపై ఆ వ్యక్తిని నిలదీసింది. పొలంలోని పంటకు నష్టం కలిగించడంపై నిరసన తెలిపింది. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి గిరిజన మహిళను కొట్టాడు. బలవంతంగా ఆమె నోట్లో మలం పోశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువైన మరో గిరిజన మహిళను కూడా అతడు కొట్టాడు.
మరోవైపు బాధిత గిరిజన యువతి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.