రాంచీ, జనవరి 24: వృద్ధాప్యంలో ఉన్న అత్త సంరక్షణ బాధ్యత కోడలే చూసుకోవాలని, ఇది భారతీయ సంప్రదాయమని జార్ఖండ్ హైకోర్టు పేర్కొన్నది. విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త తల్లి, అమ్మమ్మల బాగోగులు కోడలే చూసుకోవాలని, వారి నుంచి విడిపోయి వేరుగా కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి చేయరాదని జస్టిస్ సుభాష్ చంద్ స్పష్టంచేశారు.
విడాకుల కేసులో (రుద్ర నారాయన్ రే వర్సెస్ ప్రియాలీ రే ఛటర్జీ) రూ.30 వేలు భార్యకు, రూ.15 వేలు కుమారుడికి మనోవర్తి చెల్లించాలని దుమ్కాలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పగా, దీనిని సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోయినట్టయితే, మనోవర్తి (మెయింటనెన్స్) పొందే హక్కు భార్యకు ఉండదని ఈ కేసులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. కుటుంబంలో మహిళల ప్రాముఖ్యతను తెలుపుతూ ‘మనుస్మృతి’లో పేర్కొన్న విషయాల్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించటం గమనార్హం.