న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ , నటి కంగనా రనౌత్‌పై ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ కుమార్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యూపీలోని ప్రతాప్‌ఘడ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. రాణిగంజ్ నియోజకవర్గానికి చెందిన ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ కుమార్ .. బీజేపీ ఎంపీ కంగనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుందని సైబర్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ రాజీవ్ కుమార్ త్రివేది తెలిపారు. ఆ వీడియో ఆధారంగా బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్షుమన్ సింగ్ ఓ ఫిర్యాదు నమోదు చేశాడు. మహిళా పార్లమెంటరీ నేతపై అసభ్యకర రీతిలో ఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా వర్మపై బీఎన్ఎస్ 352 సెక్షన్, ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతున్నది.