లక్నో: ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. చివరకు కుమార్తె అసలు విషయం చెప్పడంతో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 29న కవిత అనే నర్సు, భర్త మహేష్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తాను పనిచేస్తున్న ఆసుపత్రికి భర్త మృతదేహాన్ని తీసుకెళ్లింది. దుప్పటితో ఉరి వేసుకుని చనిపోయినట్లు చెప్పింది.
కాగా, మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు, మహేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతు నొక్కి హత్య చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో నర్సు కవితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అయిన 13 ఏళ్ల బాలికను ప్రశ్నించారు. తన తండ్రిని తల్లి హత్య చేస్తుండగా తాను చూసినట్లు ఆ బాలిక చెప్పింది.
ఈ నేపథ్యంలో నర్సు కవితను పోలీసులు ప్రశ్నించారు. తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, ఆ రోజున జరిగిన ఘర్షణ తర్వాత హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆసుపత్రిలో పని చేసే వినయ్ శర్మ, కవిత మధ్య సంబంధం ఉందని తెలిపారు. కవిత భర్త హత్యలో అతడి పాత్ర కూడా ఉన్నట్లు వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, వాయిస్ రికార్డుల ద్వారా తెలిసిందని వెల్లడించారు.