న్యూఢిల్లీ: అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను భారత్, పాకిస్థాన్ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా మూడు దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. ప్రతి ఏటా జనవరి 1న, జూలై 1న ఖైదీలు, అణు స్థావరాల జాబితాలను పరస్పరం మార్చుకుంటాయి. ఇందులో భాగంగా కొత్త ఏడాది తొలి రోజైన శనివారం ఇరు దేశాల జైల్లో ఉన్న ఖైదీలతోపాటు అణు స్థావరాల వివరాలు ఇచ్చిపుచ్చుకున్నాయి.
ఈ జాబితాల ప్రకారం 282 మంది పాకిస్థాన్ ఖైదీలు, 73 మంది మత్స్యకారులు భారత్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు 51 మంది భారత ఖైదీలు, 577 మంది మత్స్యకారులు పాకిస్థాన్ కస్టడీలో ఉన్నారు. కాగా, భారత ఖైదీలతోపాటు అదృశ్యమైన రక్షణ సిబ్బంది, మత్స్యకారులను త్వరగా విడుదల చేయాలని పాకిస్థాన్ దౌత్య అధికారులను భారత దౌత్య అధికారులు ఈ సందర్భంగా కోరారు. పాక్ దౌత్య అధికారులు కూడా వారి దేశ ఖైదీలు, మత్స్యకారుల విడుదలపై చర్చించారు.