న్యూఢిల్లీ, జూలై 15: దేశంలోనే అతి పెద్దదైన కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన బ్లూప్రింట్ సహా పలు వివరాలతో కూడిన సున్నితమైన డాటా బహిర్గతమైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం డాటాలో సరఫరాదారుల వివరాలు, భవనాలు, ప్లాంట్ల వివరాలు, కేంద్రానికి సంబంధించిన ఇతర రహస్య డాటాను వరల్డ్ లీక్స్ రాన్సమ్వేర్ సంస్థ డార్క్ వెబ్‌లో ఉంచింది. దేశంలో ఉన్న ఏడు అణు విద్యుత్ కేంద్రాల్లో తమిళనాడులోని కూడంకళం కేంద్రం అతి పెద్దది. సంస్థ కాంట్రాక్టర్లలో ఒకరైన అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కూడా డాటా లీకేజీని నిర్ధారించింది. ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్టు చెప్పింది.
ఈ సర్వర్‌ను భారత డాటా సెంటర్ సేవా సంస్థ యోట్టా నిర్వహిస్తున్నది. అయితే సంస్థకు చెందిన ఏ డాటా వెల్లడైంది అన్న విషయాన్ని రిలయన్స్ చెప్పలేదు. సమాచారం లీక్ కావడం విద్యుత్ కేంద్రం భద్రతకు ప్రమాదమేనని ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ నికోలస్ రోథ్ పేర్కొన్నారు. మొత్తం 8,58,000 రిలయన్స్ ఫైళ్లలో 19 వేల ఫైళ్లు వరల్డ్ లీక్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు వార్తా కథనం తెలిపింది. ఈ అణు విద్యుత్ కేంద్రం ప్లాంట్‌లోని యూనిట్ 3, 4 నిర్మాణానికి రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2018లో కాంట్రాక్టు పొందింది. ఇంకా నిర్మాణంలో ఉన్న ఈ యూనిట్లు వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారా 2,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.