NEET, JEE Exams : వచ్చే ఏడాది నిర్వహించనున్న నీట్ (NEET), జేఈఈ (JEE) లాంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency – NTA) యోచిస్తోంది. పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో కూడా అభ్యర్థులే లైవ్ ఫొటోగ్రాఫ్ తీసుకునే ఆప్షన్ను ప్రవేశపెట్టేందుకు ఏజెన్సీ చర్యలు తీసుకుంటోంది.
నీట్ – 2025 పరీక్ష సందర్భంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆధార్ సాయంతో ఫేస్ రికగ్నిషన్ పద్ధతిని పరీక్షించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆధార్ సాయంతో అభ్యర్థుల ఫేస్ రికగ్నిషన్ చేపట్టారని, ఎన్ఐసీ డిజిటల్ మౌలిక సదుపాయాలకు దీన్ని అనుసంధానించారని వెల్లడించాయి. వచ్చే సంవత్సరం నుంచి అన్ని ప్రధాన పరీక్షల్లో ఈ పద్ధతిని ఉపయోగించనున్నట్లు సమాచారం.