జైపూర్, అక్టోబర్ 3: ఒకప్పుడు ఎన్ఎస్జీ కమాండోగా, ముఖ్యంగా 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి నేషనల్ హీరోగా నిలిచిన బజరంగ్ సింగ్ ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్‌లో ఆరితేరి దర్యాప్తు సంస్థలను ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు రాజస్థాన్ యాంటీ టెర్రరిజమ్ స్కాడ్ (ఏటీఎస్)కు చిక్కాడు.
తలపై రూ.25 వేల బహుమతి ఉన్న అతడు రాజస్థాన్ కేంద్రంగా ఒడిశా, తెలంగాణ నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. గత వారం 200 కేజీల గంజాయిని తీసుకువస్తున్న క్రమంలో బుధవారం అతడిని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) అధికారులు తెలిపారు.