న్యూఢిల్లీ, అక్టోబర్ 8: రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) అమలు విధానం పండుగ సీజన్ ముగిసే వరకు వాయిదా పడే అవకాశం ఉంది. ఎండీఆర్ అమలును వచ్చే ఏడాది జనవరి వరకు వాయిదా వేసే అంశాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పరిశీలిస్తున్నదని మనీ కంట్రోల్ పేర్కొంది.
వివిధ ఎండీఆర్ రేట్లు, వివిధ లావాదేవీలకు వాటి వర్తింపు, కొత్త విధానానికి వ్యాపార సంస్థల సన్నద్ధత వంటి అంశాలపై ఆందోళనల నేపథ్యంలో ఈ విధానం అమలును వాయిదా వేయాలని కోరుతూ వ్యాపార సంఘాలు, ఫెన్టెక్, చెల్లింపుల సేవల సంస్థల నుంచి అభ్యర్థనలు అందాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ మనీ కంట్రోల్ తన వార్తాకథనంలో పేర్కొంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నందున రానున్న రెండు రోజుల్లో ఎన్సీపీఐ ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.ఎండీఆర్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావలసి ఉంది. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ కోసం వ్యాపారులు బ్యాంకులకు చెల్లించే రుసుమే ఎండీఆర్. దీని ప్రకారం 10 వేల లావాదేవీపై రుసుం రూ.40గా ఉంటుంది.