Satyajit Ray | ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. మైమెన్సింగ్లో ఉన్న ఆ ఇంటిని రెనొవేషన్ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం ఆయన ఇంటిని కూల్చివేయొద్దని.. ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకున్నది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సత్యజిత్ రే ఇంటి కూల్చివేతను ఖండించారు. ఈ ఇంట్లో సత్యజిత్ రే తాత ఉపేంద్ర కిశోర్ రే చాలాకాలం నివసించారు. ఉపేంద్ర కిశోర్ రే ప్రముఖ సాహిత్యకారుడు.
ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం సత్యజిత్ రే పూర్వీకుల ఇంటిని కూల్చబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ణయం గురించి విని చాలా బాధపడ్డామని.. ఈ ఆస్తి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందింది. ప్రస్తుతం చాలా దారుణమైన స్థితిలో ఉంది. బెంగాలీ సాంస్కృతిక పునరుజ్జీవానికి చిహ్నంగా ఉంది. ఈ భవనం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కూల్చివేతపై పునరాలోచన చేయాలి. ఈ విషయంలో అవసరమైన సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధం ఉంది’ అని పేర్కొంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ వారసత్వ కట్టడాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై శ్రద్ధ వహించాలని కేంద్రానికి సూచించారు.