ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సమావేశంలో తాను ఎలాంటి నిరాశ చెందలేదని ఆ పార్టీ నేత అజిత్ పవార్ తెలిపారు. సమావేశం మధ్యలో వేదికపై నుంచి ఆయన లేచి వెళ్లిపోవడంపై మీడియా పదే పదే ప్రశ్నించింది. దీంతో తాను ఎలాంటి నిరాశ చెందలేదన్న ఆయన దీని గురించి స్టాంప్ పేపర్‌పై రాసి ఇమ్మంటారా? అని ఎదురు ప్రశ్నించారు. జాతీయ స్థాయి పార్టీ సమావేశం కావడంతో తాను అందులో మాట్లాడలేదని చెప్పారు. తనతోపాటు ఇతర పార్టీ నేతలు కూడా మాట్లాడలేదన్నారు. తనతోపాటు పార్టీలో ఎవరూ అసంతృప్తిగా లేరని చెప్పారు. మీడియా తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
కాగా, రెండు రోజుల పాటు జరిగిన ఎన్సీపీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారం ముగిసింది. మరో నాలుగేళ్లు పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్‌ను ఎన్నుకున్నారు. సమావేశం చివరి రోజున ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడారు. అయితే జయంత్ పాటిల్‌ను ప్రసంగించాలని పిలువడంతో వేదికపై ఉన్న అజిత్ పవార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన అలిగినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు పార్టీ కార్యకర్తలు అజిత్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత అజిత్ పవార్ ప్రసంగిస్తారని జయంత్ పాటిల్ తెలిపారు. అయితే ఆయన ఎంతకీ వేదికపైకి రాకపోవడంతో శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపి సుప్రియా సూలే అజిత్‌ను బుజ్జగించారు. దీంతో ఆయన వేదికపైకి వెళ్లారు. అయితే అప్పటికే శరద్ పవార్ ప్రసంగాన్ని ప్రారంభించి పార్టీ సమావేశాన్ని ముగించారు. దీంతో అజిత్ పవార్‌కు మాట్లాడే అవకాశం రాలేదు. అయితే దీనిపై తాను ఎలాంటి నిరాశ చెందలేదని అజిత్ పవార్ మీడియాతో సోమవారం అన్నారు.