North Eastern Railway : కొత్త ఏడాదిలో పెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇకనుంచి కుక్కలు, పిల్లలు వంటి పెంపుడు జంతువులని రైళ్లలో తీసుకెళ్లడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రైళ్లలో ప్యాసింజర్లతో పాటు పెట్స్‌ను కూడా అనుమతించాలని ఈశాన్య రైల్వే తాజాగా నిర్ణయం తీసుకుంది. అందుకని బోగీల్లో పెట్స్ కోసం తగిన మార్పులు చేయడానికి అధికారులు అంగీకరించారు. ‘రైలులో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక బోనులు ఏర్పాటు చేస్తాం. రైల్వే పోలీసులు పెట్స్ కదలికలను గమనిస్తూ ఉంటారు. అంతేకాదు జర్నీ ఆసాంతాం వాటికి తిండి, నీళ్లు అన్నీ యజమానులే చూసుకోవాలి’ అని ఈశాన్య రైల్వే పీఆర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.
అయితే.. ఇప్పటివరకు పెట్స్‌ను రైలులో తీసుకెళ్లాలంటే ఏసీ కోచ్ మొత్తం బుక్ చేసుకోవాల్సి వచ్చేది. దాంతో ఖర్చు తడిసిమోపెడయ్యేది. అందుకని చాలామంది పెట్ లవర్స్ ట్రైయిన్ జర్నీలో వాటిని వెంట తీసుకెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్లు. తాజా నిర్ణయంతో తక్కువ ఖర్చుతోనే పెంపుడు జంతువులను తమతో పాటు తీసుకెళ్లొచ్చు. దాంతో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.