Wangchuk’s wife : ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. దాంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో ఇవాళ (శనివారం) పోలీసులు ఆయనను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి (Safdarjung Hospital) కి తరలించారు. పోలీసుల తీరుపై సోనమ్ సతీమణి గీతాంజలి జె ఆంగ్మో (Geetanjali J Angmo) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
తన అనుమతి లేకుండా తన భర్తకు ఎలాంటి చికిత్స చేయకూడదని హెచ్చరించారు. ‘ఆయన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్నారు. నా అనుమతి లేకుండా చికిత్స ప్రారంభించవద్దు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరిని బాధ్యులను చేస్తా. ఆయన నిన్న బాగానే కనిపించారు. ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మా వైద్యుడి అనుమతి లేకుండా ఏ చికిత్సా అందించడానికి వీల్లేదు. అది మా హక్కు’ అని సోనమ్ సతీమణి గీతాంజలి మీడియాకు స్పష్టంచేశారు.
సోనమ్‌కు తగిన వైద్యసహాయం అందించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఇవాళ నిరసన ప్రాంతం నుంచి ఆయనను బలవంతంగా తీసుకెళ్లారు. ‘కోర్టు ఆదేశాల ప్రకారం వాంగ్చుక్ను తరలిస్తున్న సమయంలో నిరసనకారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని, వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నాం’ అని ఢిల్లీ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.