న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నూతన విధానం అమలు చేసేందుకు అనుగుణంగా 2008 జాతీయ రహదారుల రుసుము(ధరల నిర్ణయం, వసూలు) నిబంధనలను మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నోటిఫై చేసింది. టోల్ వసూలుకు ప్రస్తుతం ఉన్న నగదు, ఫాస్టాగ్ చెల్లింపు విధానాలకు అదనంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేసేందుకు నిబంధనలను మార్చింది.
జీఎన్ఎస్ఎస్ సాంకేతికత ద్వారా టోల్ చెల్లించేందుకు ముందుగా వాహనాలకు ఆన్ బోర్డ్ యూనిట్ల(ఓబీయూ)ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందనేది ఈ ఓబీయూ ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్లు నమోదవుతాయి. ఇందుకు జీపీఎస్‌తో పాటు జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్(గగన్) వ్యవస్థను వినియోగిస్తారు.
మరింత కచ్చితత్వం కోసం హైవేలపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసే సీసీటీవీ కెమెరాలతో సరిపోల్చి చూస్తారు. చివరగా టోల్ రోడ్డుపై వాహనం ప్రయాణించిన దూరానికి వర్తించే టోల్ రుసుము వాహనదారు లింక్ చేసిన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమెటిక్‌గా కట్ అయిపోతుంది. మొదటి 20 కిలోమీటర్ల ప్రయాణానికి మాత్రం టోల్ వర్తించదు. ప్రస్తుతం దేశంలో 45,428 కిలోమీటర్ల టోల్ రోడ్డు వ్యవస్థ ఉంది. విడతలవారీగా ఈ రోడ్లపై కేంద్రం జీఎన్ఎస్ఎస్ వ్యవస్థను అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యింది.