ముంబై, జనవరి 15: కారు కొనాలనుకుంటున్నారా? అయితే దానిని పార్కింగ్ చేయడానికి మీకు తప్పనిసరిగా స్థలం ఉండాల్సిందే. లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కార్లను అమ్మరు. ఈ కొత్త పాలసీని మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో వాహనాల రద్దీని నివారించడానికే ఈ నిబంధనను తేవాలని యోచిస్తున్నట్టు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు.
ట్రాఫిక్ రద్దీ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, చాలామంది పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారని, దీని కారణంగా అంబులెన్స్‌లు, ఫైర్ లాంటి సర్వీసులకు ఆటంకం ఏర్పడుతున్నదని ఆయన చెప్పారు. అయితే బీదవారు, మధ్య తరగతి వారు కార్లను కొనుగోలు చేయకుండా నిరోధించడానికి, వారిపై వివక్షను చూపడానికి ఈ నిబంధన తేవడం లేదని స్పష్టం చేశారు.