న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుమును శుక్రవారం నుంచి నగదు రూపంలో చెల్లించే అవకాశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది.
డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం లేని వాహనదారులకు ఇది ఇబ్బందికరమైనా.. టోల్ గేట్ల వద్ద భారీ వరుసలను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు ఫాస్టాగ్‌తో కాకుండా యూపీఐతో చెల్లింపులు జరిపితే 1.25 రెట్లు ఎక్కువగా టోల్ చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. ఈ నెల 1న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను ఎన్హెచ్ఏఐ 2.5 శాతం పెంచడంతో దాని ధర రూ.3,075కు చేరుకొన్నది.