Back Pain | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మీరు తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? దాని నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారా? అయితే వద్దని హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన రోగులపై వీరు చేసిన పరిశోధనకు సంబంధించిన వివరాలు బీఎంజేలో ప్రచురితమైంది. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటీస్తో సంబంధం లేని దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడే వారికి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, నరాల బ్లాక్లను సిఫార్సు చేయరాదని వీరు సూచించారు.
ఈ తీవ్ర వెన్ను నొప్పి రోగం ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఇది శారీరక వైకల్యానికి కూడా దారి తీస్తుందని, ముఖ్యంగా 20-59 ఏండ్ల మధ్య వయస్కుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇది జరుగుతున్నదని పరిశోధకులు తెలిపారు. ఇంకా ఎక్కువ వయస్కులను అచేతనంగా మార్చివేస్తున్నదన్నారు. మెదడుకు నొప్పికి సంబంధించిన సంకేతాలు చేరకుండా నిరోధించే ఎపిడ్యూరల్ ఇంజక్షన్లు, నరాల బ్లాక్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విధానాలు అనుసరిస్తున్నారని, అయితే ఈ వైద్య విధానాలు అస్థిరంగా ఉన్నాయని వారు తెలిపారు.
ఈ అనిశ్చితిని పరిష్కరించడానికి పరిశోధనా బృందం దీర్ఘకాలిక, క్యాన్సర్ సంబంధం కాని వెన్నెముక నొప్పికి సాధారణంగా వినియోగించే 13 ఇంటర్వెన్షనల్ విధానాల ప్రభావం, వాటి ఇబ్బందులు, ప్రమాదాలను విశ్లేషించింది. ప్లెసిబో చికిత్సలతో పోలిస్తే వెన్నెముక ఇంజెక్షన్లు అర్థవంతమైన ఉపశమనాన్ని అందించలేదని వారు తేల్చారు. ఈ క్రమంలో ఈ చికిత్సా విధానాలు సరైన ఫలితాలను ఇవ్వకపోగా రోగులపై ఆర్థిక భారం మోపుతున్నాయని, వైద్యులు, రోగులు ఈ చికిత్స విధానాలకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ విధానాలను పాటించాలని వారు సూచించారు.