లక్నో: మహిళల కొలతలు మగ టైలర్ తీసుకోకూడదు. మహిళలకు మగవారు హెయిర్‌కట్ చేయకూడదు. జిమ్, యోగా సెంటర్లలో మహిళలకు పురుషులు శిక్షణ ఇవ్వకూడదు. మహిళల భద్రత కోసం ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ (UP Women’s Body) ఈ మేరకు కొన్ని సిఫార్సులు ప్రతిపాదించింది. అక్టోబర్ 28న లక్నోలో జరిగిన సమావేశంలో మహిళల భద్రతను పెంపొందించే చర్యలపై మహిళా కమిషన్ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా పురుష టైలర్లు మహిళల కొలతలు తీసుకోకుండా నిరోధించాలని, మహిళా బట్టల షాపుల్లో కేవలం మహిళా సిబ్బందిని నియమించాలని, పాఠశాల బస్సులలో మహిళా భద్రతా సిబ్బందిని ఉంచాలని, జిమ్, యోగా సెంటర్లలో మహిళలకు పురుషులు శిక్షణ ఇవ్వకూడదని, అన్ని చోట్ల సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కాగా, మహిళల భద్రతను మెరుగుపరిచే లక్ష్యం కోసం వివిధ విధానాలను అన్వేషిస్తున్నట్లు యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మనీషా అహ్లావత్ తెలిపారు. ఈ నేపథ్యంలో మగవారి చెడు ఉద్దేశాలు, బ్యాడ్ టచ్, అసభ్య ప్రవర్తన నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. అయితే మగవాళ్ళందరికీ చెడు ఉద్దేశాలు ఉంటాయన్నది తమ అభిప్రాయం కాదన్నారు.
మరోవైపు ఈ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను ఇంకా నిర్ణయించలేదని మనీషా అహ్లావత్ తెలిపారు. తుది ఆమోదం తర్వాత ఈ ప్రతిపాదనలను గ్రౌండ్ లెవల్లో అమలు చేసేందుకు తగిన విధానాలు, చట్టాలు రూపొందించడం కోసం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తామని ఆమె అన్నారు.