న్యూఢిల్లీ : ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాద విషాదం, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, కొన్ని సర్వీసుల రద్దు తదితర అంశాలపై డీజీసీఏ దృష్టి సారించింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి విమానాల నిర్వహణా సామర్థ్యంపై సమీక్షించింది. అవన్నీ భద్రతా పరమైన తనిఖీలకు అనుగుణంగానే ఉన్నాయని, బోయింగ్ 787 విమానాల నిఘాలో ఎలాంటి పెద్ద భద్రతా సమస్యలు తలెత్తలేదని డీజీసీఏ తెలిపింది.
ఎయిరిండియా బీ787 విమానాలు, సంబంధిత నిర్వహణా వ్యవస్థలు ప్రస్తుత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్టు గుర్తించామని డీజీసీఏ పేర్కొంది. అయితే ఇటీవల ఎయిరిండియాలో నిర్వహణాపరమైన సమస్యలు తలెత్తినట్టు ఏవియేషన్ వాచ్డాగ్ పేర్కొంది. ఇంజనీరింగ్, ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ యూనిట్ల మధ్య సమన్వయాన్ని పెంచాలని ఆదేశించామని తెలిపింది. అహ్మదాబాద్ విషాదం తర్వాత జూన్ 12-17 వరకు 66 బోయింగ్ 787 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.