ఇండోర్: మన దేశంలో బాల నేరస్థుల పట్ల అతి దయతో వ్యవహరిస్తున్నట్లు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు నుంచి చట్ట సభలు గుణపాఠం నేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2017లో అప్పటికి 17 ఏళ్ల వయసుగల బాలుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఇండోర్‌లోని అదనపు సెషన్స్ జడ్జి అతనిని దోషిగా నిర్ధారించి, 2019 మే 8న పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ తీర్పు వెలువడిన ఆరు నెలల తర్వాత ఆ బాల నేరస్థుడు మరో ఏడుగురు బాలలతో కలిసి జువెనైల్ కరెక్షన్ హోమ్ నుంచి పారిపోయాడు. క్రింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ బాల నేరస్థుని తరపున మధ్య ప్రదేశ్ హైకోర్టులో అపీలు దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు అపీలును డిస్మిస్ చేసింది. పరారైన అపీలుదారుపై వారంట్ జారీ చేయాలని ఈ నెల 11న ఆదేశించింది. మిగిలిన శిక్ష అమలుకు అతడిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది.