Kerala techie : కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య అనే యువతి ఆచూకీ దొరికింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను రెస్క్యూ టీమ్ గుర్తించింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. కేరళలోని కోజికోడ్ జిల్లా్కు చెందిన జీఎస్ శరణ్య అనే ఐటీ ఉద్యోగిని ట్రెక్కింగ్ కోసం గత బుధవారం కర్ణాటక వచ్చింది. కొడుగు జిల్లా, తడియండమోల్ ప్రాంతంలో పర్వతారోహణకు వెళ్లింది. బుధవారం స్థానికంగా ఒక ఇంట్లో బస చేసి, గురువారం ఉదయం పర్వతారోహణకు వెళ్లింది.
అటవీ అధికారులు ఆమెను చెక్ పాయింట్ వద్ద వివరాలు సేకరించి, వేరే బృందంతో కలిసి పంపించారు. ఎనిమిది గంటలకు అందరితో కలిసి వెళ్లింది. 10.40 గంటలకు పర్వతారోహణ పూర్తి చేసుకుని బయల్దేరారు. ఈ క్రమంలో తను వేగంగా నడవడం, బృందంలోని మిగతా వారు కూడా తలోదిక్కుకు వెళ్లడం.. ఇలా చివరికి తను ఒంటరిగానే మిగిలిపోయింది. అయినప్పటికీ వేరే వాళ్లతో కలవడానికి ప్రయత్నించింది. కానీ, ఒక్కరు కూడా కనిపించలేదు. మధ్యాహ్నం తర్వాత తను బసచేసిన ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తాను తప్పిపోయానని సాయం చేయాలని కోరింది. ఇక తన స్నేహితులకు ఫోన్ చేసేలోపే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఈ సమయంలో తను సాయం కోసం ఎదురుచూసింది. తను తప్పిపోయానని గ్రహించి ఒక చిన్న నీటి ప్రవాహం వద్ద ఉన్న రాయి మీద ఎదురుచూస్తూ ఉండిపోయింది. తనను వెతుక్కుంటూ ఎవరైనా వస్తారని నమ్మింది.
నీళ్లు మాత్రమే తాగి..
ఈ సమయంలో తను అక్కడ ఉండటానికి ఆహారం, నీరు లేవు. దీంతో నీటి ప్రవాహం వద్ద బాటిల్లో నీళ్లు తెచ్చుకుని, తాగి, తనను తాను రక్షించుకుంది. వేరే మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించినా, అది చివరికి దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది. అందుకే, ఆ రాయి ఉన్న చోటే ఉండిపోయింది. ఏనుగులు వంటి అటవీ జంతువులు ఉన్న పెద్దగా భయపడలేదని తెలిపింది. ఇలా నాలుగు రోజులు ఆ రాయి వద్దే ఉండిపోయింది. మరోవైపు నాలుగు రోజులుగా ఆమె కోసం అటవీ అధికారులు, పోలీసులు గాలించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆమెను సహాయక బృందాలు గుర్తించాయి. దీంతో ఆమెను సురక్షితంగా అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయినప్పటికీ, ట్రెక్కింగ్ చేయడం మాత్రం మానబోనని తెలిపింది.