న్యూఢిల్లీ, జనవరి 5: ఇంతకాలం ఏకాంతంగా గడపడానికి ఓయో రూమ్‌లను వినియోగించుకున్న పెండ్లికాని యువతీ యువకులు, జంటలకు బ్యాడ్ న్యూస్. ఓయో రూమ్‌లు ఇక నుంచి వారికి అందుబాటులో ఉండవు. ఇక నుంచి పెండ్లి కాని జంటలకు రూమ్‌లను అద్దెకు ఇవ్వమని ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో ప్రకటించింది. ఈ మేరకు కొత్త చెక్-ఇన్ పాలసీ గురించి వివరిస్తూ తమ భాగస్వామ్య హోటళ్లకు ఈ ఏడాది నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని తెలిపింది.
తొలుత దీనిని మీరట్‌లో తక్షణం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నది. ఈ కొత్త పాలసీ ప్రకారం జంటలు ఇకపై ప్రత్యక్షంగా కానీ, ఆన్లైన్లో కానీ ఓయో రూమ్‌లు బుక్ చేస్తే తమకు వివాహమైందన్న రుజువును తప్పనిసరిగా సమర్పించాలి.
కాగా, పెండ్లి కానీ యువతీ యువకులు, విద్యార్థినీ, విద్యార్థులు, ఇతర జంటలు ఏకాంతంగా కలుసుకునేందుకు ఇదివరకు ఓయో రూమ్‌లు సులభంగా లభించేవి. ఓయో యాప్‌లో బుక్‌చేసుకుని హోటల్‌కు వెళితే వారికి నేరుగా రూమ్ కేటాయిస్తారు. ఒక్క ధ్రువీకరణ పత్రం తప్ప, ఇతర వివరాలేవీ అడగరు. దీనిపై ఆరోపణలు రావడంతో ఓయో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.