ఇంఫాల్, మే 21: తెగల ఆధారంగా మణిపూర్‌ను విభజించవద్దని కేంద్ర విదేశీ వ్యవహారాలు, విద్యా శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి లేఖ రాశారు. కుకీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమ తెగ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలని ఇటీవల అమిత్ షాను కోరిన నేపథ్యంలో రాజ్‌కుమార్ ఈ మేరకు లేఖ రాశారు. కుకీ వర్గం ఎమ్మెల్యేలపై మిలిటెంట్లు సహా వివిధ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నందునే ఈ డిమాండ్‌ను లేవనెత్తారని ఆయన పేర్కొన్నారు. 35 తెగలు ఉన్న చిన్న రాష్ర్టానికి ఇలాంటి ప్రతిపాదన చాలా ప్రమాదకరమని అన్నారు. అల్లర్లను కఠినంగా అరికట్టాలని, తెగల ఆధారంగా విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ఆయన కోరారు.