న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో గంగా నదిలో పడేసిన మృతదేహాలపై ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ రాజ్యసభలో సోమవారం ఒక ప్రశ్న అడిగారు. కరోనా నేపథ్యంలో గంగా నదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ దీనికి సమాధానమిచ్చారు. గంగా నదిలో పడేసిన కరోనా మృతదేహాల సంఖ్యకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదన్నారు.
అయితే గుర్తు తెలియని, సగం లేదా పూర్తిగా కాలిన మృతదేహాలు గంగా నదిలో కొట్టుకుని వచ్చినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్, బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. గంగా నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యల గురించి నివేదికలు కోరామని అన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల సీఎస్‌లకు పలు సూచనలు పంపినట్లు వివరించారు. ఈ మేరకు రాత పూర్వకంగా ఆయన సమాధానమిచ్చారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గు లేదని విమర్శించారు. గత ఏడాది మే, జూన్ నెలల్లో కరోనా సెకండ్ వేవ్ పీక్ సమయంలో గంగా నదిలో వందలాది శవాలు తేలడాన్ని ప్రపంచమంతా చూసి నివ్వెరపోయిందన్నారు. కరోనాతో బాధపడి మరణించిన వారికి అప్పుడైనా కనీస గౌరవం ఇవ్వాలని మాత్రమే తాము ఆశించామన్నారు. అయితే సిగ్గులేని కేంద్ర ప్రభుత్వానికి ఇవేమీ పట్టవని మండిపడ్డారు.