Fire accident : ఎంపీల హౌసింగ్ కాంప్లెక్స్ (MPs housing complex) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని బాబా ఖరగ్సింగ్ మార్గ్ (Baba Kharag Singh marg) లో ఉన్న ఎంపీల నివాస సముదాయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. పార్లమెంట్ బిల్డింగు (Parliament building) కు కేవలం 200 మీటర్ల దూరంలో రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి ఎదురుగా ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలు ఉంటాయి.
ఆ నివాస సముదాయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు 14 ఫైరింజన్లను పంపించి మంటలను ఆర్పిస్తున్నారు. దాదాపు గంటపాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పార్కింగ్ ప్రాంతంలో నిల్వ చేసిన ఫర్నీచర్ నుంచి మంటలు చెలరేగి పైకి వ్యాపించినట్లు డీసీపీ దేవేశ్ మహ్లా తెలిపారు.
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. కానీ ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. దీపావళి పండుగకు ఎంపీలందరూ స్వస్థలాలకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.