తిరువనంతపురం: కేరళలో ఓ ఆలయం వద్ద జంతు బలి జరిగినట్లు గురువారం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, మరికొంత మందిని టార్గెట్ చేస్తూ శత్రు భైరవి యాగం(Shatru Bhairavi Yagam) నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జంతు బలి కూడా చేస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఇవాళ కేరళ సర్కారు ఖండించింది. కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతుబలి జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో జంత బలి జరిగినట్లు కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించారని, కానీ దాంట్లో వాస్తవం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, దీని కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని, ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం ఎందుకు ఆ ఆరోపణలు చేశారో తేలాల్సి ఉందన్నారు. కేరళలోని ఇతర ఆలయాల్లో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు వంద శాతం అబద్ధమని మంత్రి పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.