మంగళవారం 26 మే 2020
National - Feb 29, 2020 , 02:16:29

సుప్రీంకోర్టుకు నిర్భయ కేసు దోషి

సుప్రీంకోర్టుకు నిర్భయ కేసు దోషి
  • ఉరిశిక్షను జీవితఖైదుకు తగ్గించాలని విజ్ఞప్తి.. క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలుచేసిన పవన్‌ గుప్తా

న్యూఢిల్లీ: తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా తగ్గించాలని కోరుతూ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్‌ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు జారీచేసిన ఆదేశాలను వాయిదావేయాలని కోరుతూ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలుచేశాడు. ఈ నెల 17న ట్రయల్‌ కోర్టు నిర్భయ కేసు దోషులను మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని డెత్‌ వారెంట్లను జారీచేసింది. ఈ ఆదేశాల్ని సవాల్‌చేస్తూ.. పవన్‌కుమార్‌ గుప్తాకు ఉరిశిక్ష వేయొద్దని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ ద్వారా విజ్ఞప్తిచేశారు. ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోని పవన్‌ వేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైతే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వెసులుబాటు అతనికి ఉన్నది. మిగిలిన ముగ్గురు దోషులు.. రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.


logo