Nipah virus : పొరుగు రాష్ట్రమైన కేరళ (Kerala) లోని కోజికోడ్ (Kozhikode) లో నిపా వైరస్ (Nipah virus) అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు (Kerala-Tamil Nadu) సరిహద్దుల్లోని నీలగిరి జిల్లా యంత్రాంగం నిఘా చర్యలను చేపట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా జరిగే రాకపోకల దృష్ట్యా ముందు జాగ్రత్తగా సరిహద్దులను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు.
తాళూర్, నాడుగని, నంబియార్‌కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులలో నిపా వైరస్ లక్షణాలు ఉన్నాయా.. లేదా..? అని నిశితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, ఉపాధి నిమిత్తం ప్రతిరోజూ కేరళకు వెళ్లి వచ్చే సరిహద్దు గ్రామాల ప్రజలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రులను యంత్రాంగం అప్రమత్తం చేసింది.
నిపా వైరస్ లక్షణాలతో కూడిన ఏ ఒక్క అనుమానిత కేసు వచ్చినా వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేరళ నుంచి వచ్చే వారికి జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే స్వచ్ఛందంగా వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఇప్పటివరకు ఎలాంటి నిపా వైరస్ ముప్పు నిర్ధారణ కాలేదని, ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆమె కోరారు. కేరళలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం సమీక్షిస్తున్నామని, జిల్లా యంత్రాంగం ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉందని తెలిపారు.