కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సిటీలో జికా వైరస్ ( Zika virus ) కలకలం కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం కూడా కొత్తగా 9 మందిలో జికా వైరస్ బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 98కి చేరింది. వైరస్ కట్టడి కోసం నగరంలో మొత్తం 100 వైద్య బృందాలు రంగంలోకి దిగి పనిచేస్తున్నాయని కాన్పూర్ సిటీ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ చెప్పారు. నగరంలో ఎక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయి..? పరిసరాల్లో ఎవరిలో జికా లక్షణాలు ఉన్నాయి..? అనేది గుర్తించి పరీక్షలు చేయించడం, తగిన చికిత్స అందేలా చూడటం వైద్య బృందాల పని ఆయన తెలిపారు.
అదేవిధంగా కాన్పూర్‌కు చెందిన ఆరోగ్య విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జికా ఇన్ఫెక్టెడ్ ఏరియాల్లో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నేపాల్ సింగ్ చెప్పారు. శ్యామ్‌నగర్, కోయిలా నగర్, చకేరి, జగ్మౌ, ఎయిర్‌ఫోర్స్ కాలనీల్లో జికా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.