న్యూఢిల్లీ, మార్చి 31: ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారిణి నిధి తివారీని నియమించినట్టు కేంద్ర సిబ్బంది శాఖ సోమవారం ప్రకటించింది. 2014 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం పీఎంఓలో డిప్యుటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. నిధి తివారీ నియామకాన్ని క్యాబినెట్ ఆపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించినట్టు మార్చి 29వ తేదీతో వెలువడిన ఉత్తర్వులు పేర్కొన్నాయి. యూపీకి చెందిన తివారీ గతంలో వారణాసిలో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. పీఎంఓలో చేరడానికి ముందు ఆమె విదేశాంగ శాఖలో పనిచేశారు. నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు భద్రతకు చెందిన అంశాలను నేరుగా నివేదించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.