ముంబై: నాసిక్‌లోని టీసీఎస్ యూనిట్లో మతమార్పిడులు, వేధింపులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో సస్పెండ్ అయిన టీసీఎస్ ఉద్యోగి, ప్రధాన నిందితురాలు నిదా ఖాన్(Nida Khan)ను పోలీసులు పట్టుకున్నారు. గత 25 రోజుల నుంచి ఆమె పరారీలో ఉన్నది. ఛత్రపతి శాంభాజీ నగర్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార నిందితులకు అండగా నిదా ఖాన్ ఉన్నట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు ఫిర్యాదులు ఇవ్వకుండా ఆమె అడ్డుకునేదని తేలింది. దీంతో పాటు మతమార్పిడులను కూడా ఆమె ఎంకరేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నాసిక్‌లోని టీసీఎస్ బీపీవో యూనిట్లో ఈ ఘటనలు జరిగాయి. నిందితురాలు నిదా ఖాన్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తీవ్ర నిఘా పెట్టారు. అయితే ముందస్తు బెయిల్ మంజూరీ చేయాలని నాసిక్ కోర్టుకు నిదా ఖాన్ అభ్యర్థన పెట్టుకున్నది. కానీ ఆ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు. డిజిటల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్న కారణంగా.. కస్టడీ విచారణ అవసరమని ప్రాసిక్యూషన్ కోర్టులో పేర్కొన్నది.
నాసిక్ పోలీసు కమీషనర్ ఆదేశాల ప్రకారం సిట్ బృందం ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నది. ఇస్లాం మతం స్వీకరించేలా నిదా ఖాన్ ప్రోత్సహించిందని, హిజాబ్, బుర్కా ధరించేలా బాధితులను మానసికంగా బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.