NIA Chief | న్యూఢిల్లీ : పహల్గాంలోని బైసరన్‌లో ముష్కరులు కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల చర్యలపై సీరియస్‌గా ఉంది. ముష్కరుల ఏరివేతకు కేంద్రం చర్యలు ఉపక్రమించింది. అయితే గురువారం మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ డేట్.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డ బైసరన్ వ్యాలీలో పర్యటించారు. ఆ ప్రాంతంలో సుమారు మూడు గంటల పాటు పర్యటించి.. కాల్పులు జరిపిన తీరును పరిశీలించారు. కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. ఎన్ఐఏ డీజీ వెంట సీనియర్ అధికారులు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉన్నారు. ఇక బైసరన్ వ్యాలీలో పర్యటించిన అనంతరం ఎన్ఐఏ డీజీ సీఆర్పీఎఫ్ క్యాంప్‌కు తిరిగి చేరుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీతో(సీసీఏ) సమావేశమైన ప్రధాని.. అనంతరం రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీతో(సీసీపీఏ) భేటీ అయ్యారు. ప్రధానితోపాటు హోంమంత్రి, రక్షణమంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి సభ్యులుగా ఉండే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. పహల్గాం ఘటన తర్వాత సమావేశం కావడం ఇది రెండోసారి. అయితే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీనినే సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత సూపర్ క్యాబినెట్ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో కేంద్ర క్యాబినెట్‌లోని టాప్ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుత సీసీపీఏలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు.
2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనపై ప్రతీకార చర్యలు చేపట్టడంపై చర్చించేందుకు సీసీపీఏ సమావేశమైంది. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడుల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత సీసీపీఏ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది. మంగళవారం ప్రధాని తన గృహంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత బుధవారం సైతం వరుస సమావేశాలు నిర్వహించడం చూస్తుంటే పాకిస్థాన్‌పై యుద్ధానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. సీమాంతర ఉగ్రవాదం, దాన్ని సూత్రధారులపై ఎప్పుడు, ఎలా చర్యలు తీసుకోవాలన్నదానిపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
#WATCH | Jammu and Kashmir | NIA DG Sadanand Vasant Date leaves from Pahalgam after visiting the attack site in Baisaran, along with the senior officials of NIA & Jammu Kashmir Police #PahalgamTerroristAttack pic.twitter.com/2qpjo52SEC
— ANI (@ANI) May 1, 2025