న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలు లీక్ చేసిన ఐపీఎస్ అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్(ఓజీడబ్ల్యూ)కు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై మాజీ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయనను గత ఏడాది నవంబర్ 6న నమోదు చేసిన కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.
నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక, అమలు కోసం ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (ఓజీడబ్ల్యూ) నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు జరుపుతుంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా గతంలో ఎన్ఐఏలో ఎస్పీగా పని చేసిన ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగి పాత్ర బయటపడింది.
దీంతో హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఆయన ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఎన్ఐఏకు చెందిన రహస్య పత్రాలను ఆయన లీక్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులోని మరో నిందితుడైన లష్కరే తోయిబాకు చెందిన ఓజీడబ్ల్యూ వ్యక్తికి ఎన్ఐఏ కీలక ప్రతాలను ఆ అధికారి ఇచ్చినట్లు తేలింది. దీంతో ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగిని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.