న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేను అధికారులు మూసివేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 2 వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేని పూర్తిగా కన్వరియాల (Kanwar Yatra) కోసం వినియోగించనున్నారు. సుమారు 1.25 కోట్ల మంది కన్వర్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో పవిత్ర గంగా జలం సేకరించి తమ స్వతస్థలాలకు బయల్దేరారు. వీరిలో అత్యధికులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచే గంగాజలాన్ని సేకరించారు. అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు తమ కావడి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఆటంకం కలుకగకుండా వచ్చే నెల 2 వరకు హైవేను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్తరాది ప్రజలు ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజుని శ్రావణ మాసం మొదటి రోజుగా లెక్కిస్తారు. పవిత్రమైన శ్రావణమాసంలో మాసశివరాత్రి త్రయోదశినాడు శివుడికి గంగా జలంతో అభిషేకం నిర్వహిస్తారు. దీనికోసం కాలినడకన బయల్దేరి హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రదేశాల నుంచి గంగా జలాన్ని సేకరించి కావడిలో తమ స్వస్థలాలకు తీసుకెళ్తారు. జూలై 22న ప్రారంభమైన ఈ యాత్ర శ్రావణ మాస శివరాత్రి రోజు అంటే త్రయోదశి నాడు అంటే ఆగస్టు 2న ముగుస్తుంది. దీంతో కన్వరీల రద్దీ దృష్ట్యా 58వ జాతీయ రహదారి అయిన డెహ్రాడూన్-ఢిల్లీ హైవేను అధికారులు మూసివేశారు. రోడ్డుకు ఇరువైపులా కావడీల కోసం కేటాయించారు.