ముంబై: జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన విపక్షాల మెగా సమావేశాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చాలా రెస్ట్‌లెస్‌గా కనిపిస్తున్నారని అన్నారు. పాట్నా తర్వాత విపక్షాల తదుపరి సమావేశం జూలై 13, 14న బెంగళూరులో జరుగుతుందని ఆయన చెప్పారు.
కాగా, పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్‌తో సహా 17 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కోవడంపై చర్చించాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ముందుకు సాగాలని పార్టీల అధినేతలు భావించారు. దీనికి సంయుక్త వ్యూహరచన కోసం సిమ్లాలో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే విపక్షాల తదుపరి సమావేశం సిమ్లా బదులు బెంగళూరులో జరుగుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గురువారం స్పష్టం చేశారు.
మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపక్ష పార్టీల ఐక్యత కోసం ఎంతో శ్రమిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. విపక్షాల సమావేశానికి ముందు పలు పార్టీల అధినేతలను ఆయన స్వయంగా కలిశారు. పాట్నాలో విపక్షాల
తొలి సమావేశానికి నాంది పలికారు.