నాగ్‌పూర్: బండి సజావుగా నడవటం ప్రారంభమైనపుడు పాత తరం తప్పుకొని, కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వచ్చే నెల 6 నుంచి 8 వరకు నాగ్‌పూర్‌లో అడ్వాంటేజ్ విదర్భ ఎక్స్పో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎక్స్పోను అసోసియేషన్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ (ఏఐడీ) అధ్యక్షుడు ఆశిష్ కాలే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గడ్కరీ మాట్లాడుతూ, ఆశిష్ దీనిలో యువతరానికి భాగస్వామ్యం కల్పించారన్నారు. ఆశిష్ తండ్రి తనకు మిత్రుడేనని, తమను క్రమంగా విరమించుకునేలా చేయాలని, బాధ్యతలను కొత్త తరానికి అప్పగించేలా చేయాలని అన్నారు. బండి సజావుగా నడవటం ప్రారంభమైన తర్వాత, దానిని వృద్ధ తరం వదిలిపెట్టి, వేరొక పని చేసుకోవాలని చెప్పారు. విదర్భలో వివిధ రంగాల్లో గొప్ప ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారని తెలిపారు. దేశ పారిశ్రామిక చిత్రపటంలో విదర్భను పటిష్ట స్థానంలో నిలపడమే లక్ష్యంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.