న్యూఢిల్లీ: చైనా ఏజెంట్ల నిధులతో భారత్ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించారనే కేసులో అప్రూవర్‌గా మారాలని న్యూస్‌క్లిక్ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి నిర్ణయించుకున్నారు. ఆయన ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్పెషల్ జడ్జి హర్దీప్ కౌర్‌కు దరఖాస్తు చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేస్తానని చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు చక్రవర్తి, న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పుర్కాయస్థల దర్యాప్తును పూర్తి చేయడానికి గడువును 60 రోజులు పొడిగిస్తూ ఇటీవల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
వీరిద్దరినీ పోలీసులు అక్టోబరులో అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, ఈడీ, సీబీఐ ఈ కేసులో వేర్వేరు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగంతో సత్సంబంధాలున్న నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి న్యూస్‌క్లిక్‌కు రూ.38 కోట్లు వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించడంతో సోదాలు నిర్వహించి, ఈ కేసులను నమోదు చేశారు.