చెన్నై: కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఆ రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ సోమవారం సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించింది. సీఎం స్టాలిన్ సమక్షంలో 31 జంటలకు వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. 16 మంది పిల్లలను కనాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు.
కాగా, పూర్వ కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు 16 రకాల సంపదలు పొందాలని పెద్దలు ఆశీర్వదించేవారని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు. ‘మీకు 16 కలిగి సుభిక్షంగా జీవించాలని పెద్దలు కోరుకునేవారు. అంటే 16 మంది పిల్లలు కాదు, 16 రకాల సంపదలను సూచిస్తుంది. వీటిని ‘ఆవు, ఇల్లు, భార్య, పిల్లలు, విద్య, జిజ్ఞాస, జ్ఞానం, క్రమశిక్షణ, భూమి, నీరు, వయస్సు, వాహనం, బంగారం, ఆస్తి, పంట, ప్రశంసలు’ అని రచయిత విశ్వనాథన్ తన పుస్తకంలో పేర్కొన్నారు’ అని తెలిపారు.
మరోవైపు పెళ్లైన కొత్త జంటలను 16 రకాల సంపదలు పొందాలని ఇప్పుడు ఎవరూ ఆశీర్వదించడం లేదని స్టాలిన్ అన్నారు. తగినంత సంతానం కలిగి సుఖంగా జీవించాలని మాత్రమే అనుగ్రహిస్తారని చెప్పారు. అయితే పార్లమెంటరీ నియోజక వర్గాలను తగ్గించే అవకాశం ఉన్నదని తెలిపారు. ‘మీరు ఆశ్చర్యపోయేలా 16 మంది పిల్లలను మనం కలిగి ఉండాలన్న పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ విషయాన్ని మరచిపోవద్దు’ అని అన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. జనాభా సమతుల్యతపై వృద్ధాప్య జనాభా ప్రభావంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని చంద్రబాబు కోరారు. ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతించే చట్టాన్ని తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని వెల్లడించారు.
#WATCH | “பதினாறும் பெற்று பெருவாழ்வு வாழ்க-ன்னு வாழ்த்துவாங்க.. அந்த 16 என்னன்னு தெரியுமா?”
பட்டியல் போட்டு சொன்ன முதலமைச்சர் மு.க.ஸ்டாலின்#SunNews | #CMMKStalin | #MarriageFunction | @mkstalin pic.twitter.com/fyNCmnI94D
— Sathiyamoorthi Moorthi (@Sathiya07123796) October 21, 2024