గోరఖ్‌పూర్: పెళ్లి జరిగిన మూడు రోజులకే విడాకులు(Divorce) డిమాండ్ చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. వైవాహిక బంధానికి అసమర్థుడిని అని తన భర్త పెళ్లినాటి రాత్రే తనకు చెప్పినట్లు ఆ కొత్త పెళ్లికూతురు తన దరఖాస్తులో పేర్కొన్నది. పెళ్లి కొడుకు తండ్రి కాలేడన్న విషయాన్ని మెడికల్ రిపోర్టు ద్వారా వధువు బంధువులు నిర్ధారించారు. దీంతో పెళ్లికి పెట్టిన కట్నం, పెళ్లి ఖర్చులు, గిఫ్ట్‌లు అన్నీ తిరిగి ఇచ్చేయాలని వధువు బంధువులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వరుడి ఇంటికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు.
శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో జీవితాన్ని గడపలేనని ఆ మహిళ తన నోటీసులో పేర్కొన్నది. 25 ఏళ్ల పెళ్లికుమారుడు పెళ్లినాటి రాత్రి ఈ విషయాన్ని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఓ రైతు కుటుంబానికి చెందిన వరుడు గోరఖ్‌పూర్ పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.బెలియాపార్కు చెందిన బంధువులు ఈ పెళ్లి కుదిర్చారు. నవంబర్ 28వ తేదీన ఆ పెళ్లి జరిగింది. డిసెంబర్ ఒకటో తేదీన వరుడి ఇంటికి వధువు తండ్రి వెళ్లడంతో ఈ విషయం బయటకు తెలిసింది.
వైవాహిక బంధానికి మెడికల్‌గా ఫిట్ లేనన్న విషయాన్ని వరుడే తనకు చెప్పినట్లు వధువు వెల్లడించింది. దీంతో ఆమెను తల్లిగారింటికి తీసుకెళ్లారు. వరుడి శారీరక పరిస్థితిని దాచిపెట్టినట్లు వధువు బంధువులు ఆరోపించారు. అయితే అతనికి ఇది రెండో పెళ్లి అని తెలిసింది. ఇదే కారణాల చేత మొదటి భార్య నెలలోనే వెళ్లిపోయినట్లు చెప్పారు.
రెండు కుటుంబాల అంగీకారంతోనే ప్రైవేటు ఆస్పత్రిలో వరుడికి పరీక్ష చేయించారు. మెడికల్ అన్‌ఫిట్ రిపోర్టు రావడంతో తన కూతుర్ని తండ్రి స్వంత ఇంటికి తీసుకెళ్లాడు. పోలీసుల జోక్యంతో సెటిల్మెంట్ జరిగింది. పెళ్లి ఖర్చుల కింద ఏడు లక్షలతో పాటు అన్ని గిఫ్ట్‌లు నెలలో తిరిగి ఇచ్చేయాలని అంగీకరించారు. బంధువుల సమక్షంలో ఆ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు.