నేషనల్ డెస్క్: కరోనాతో రెండున్నరేండ్లుగా పోరాడుతున్న ప్రపంచ దేశాలను కొత్త వ్యాధులు వణికిస్తున్నాయి. మంకీపాక్స్, వెస్ట్నైల్ ఫీవర్, కాంగో ఫీవర్, టమాట ఫ్లూ, హెపటైటిస్ ఏ, ఎబోలా, స్క్రబ్ టైఫూస్ తదితర వ్యాధులతో పలు దేశాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఎండమిక్ (స్థానికంగానే ప్రభావం) స్థాయిలోనే ఉన్న ఈ వ్యాధులు పాండమిక్గా (మహమ్మారి) మారితే కరోనా సంక్షోభం కొనసాగుతున్న ఇలాంటి సమయంలో వైద్య వ్యవస్థపై అదనపు భారం పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా వీటిని కట్టడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.
కరోనా
2019 చివర్లో చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి ఇప్పటివరకూ 53 కోట్ల మందికి సోకింది. 63 లక్షల మంది మరణించారు. ఈ వైరస్ ప్రస్తుతం చైనాను మరోసారి వణికిస్తున్నది. దీంతో అక్కడ ప్రధాన నగరాల్లో కఠిన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
మంకీపాక్స్
పశ్చిమ ఆఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన ఈ వైరస్ అమెరికాతో సహా 23 దేశాలకు పాకింది. 350 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో మరణించారు. వైరస్ సోకిన కోతులు, జంతువుల ద్వారా ఇది మనుషులకు సోకుతుంది.
వెస్ట్ నైల్ ఫీవర్
వెస్ట్ నైల్ వైరస్ సోకిన దోమల కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇటీవల ఈ వ్యాధి సోకి కేరళలో ఒకరు మరణించారు. మరో ఇద్దరిలో వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. రానున్న వర్షకాలంలో కేసులు పెరుగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెపటైటిస్ ఏ
అమెరికా, యూకేలో 200 వరకు కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ వ్యాధి కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకరు మరణించారు. కాలేయం పాడవ్వడంతో 17 మంది పిల్లలకు కాలేయ మార్పిడి చికిత్స చేశారు. వ్యాధికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
స్క్రబ్ టైఫూస్
ఒరియెంటియా సుట్స్గమూషీ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది. భారత్, ఇండోనేషియా, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నది. వ్యాధి ముదిరితే మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదమున్నది.
కాంగో ఫీవర్
నైరో వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇరాన్లో ఈ వ్యాధితో ఇప్పటికే 19 మంది మరణించారు. వ్యాధి సోకిన వ్యక్తుల ముక్కు, అంతర్గత అవయవాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుంది. వ్యాధి సోకిన ప్రతీ ఐదుగురిలో ఇద్దరు మరణించే ప్రమాదమున్నది.
టమాట ఫ్లూ
ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. చర్మంపై దురద, దద్దుర్లు ఈ వ్యాధి లక్షణాలు. కేరళలో 100కు పైగా కేసులు, ఒడిశాలో 26 కేసులు నమోదయ్యాయి. వ్యాధికి గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఎబోలా
1976లో ఆఫ్రికాలో గుర్తించిన ఈ వైరస్ మళ్లీ క్రమంగా పడగ విప్పుతున్నది. ఆఫ్రికా దేశాల్లో ఐదారు కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. ఈ వ్యాధి సోకితే 90% మరణిం చే ప్రమాదమున్నది. ఇప్పటివరకూ ఈ వ్యాధితో 11,323 మంది మరణించారు.