కరోనాలో మరో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రపంచమంతా డెల్టా వేరియంట్ గురించి భయపడుతున్న వేళ ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళనకర ప్రకటన చేసింది. కరోనాలో మరో కొత్త మూ/బీ.1.621 వేరియంట్‌ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇది వ్యాక్సిన్ కల్పించే రక్షణను తప్పించుకొని మరీ దాడి చేయగలదని వీక్లీ బులెటిన్‌లో పేర్కొన్నది. దీనిని జనవరిలో కొలంబియాలో మొదటిసారి గుర్తించినట్టు తెలిపింది. దక్షిణ అమెరికా, యూరప్‌లో ఈ కేసులు ఎక్కువగా నమోదైనట్టు పేర్కొన్నది. కొలంబియా, ఈక్వెడార్లలో ఆందోళనకర స్థాయిలో ఈ వేరియంట్ వ్యాప్తి ఉన్నదని తెలిపింది.
పాము విషంతో కరోనాకు అడ్డుకట్ట!
బ్రెజిల్లో ఎక్కువగా కనిపించే జురారాకసో అనే రకం పాము విషంలోని ఓ కణానికి కరోనా వైరస్‌ను నియంత్రించే గుణం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. పరిశోధనల్లో భాగంగా ఈ కణాన్ని కరోనా సోకిన కోతుల్లో ప్రవేశపెట్టగా అది వైరస్ పునరుత్పత్తిని గణనీయంగా తగ్గించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు ఔషధం తయారీలో ఈ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు. పాము విషంలోని ఈ ప్రత్యేక కణాన్ని కృత్రిమంగా తయారుచేయవచ్చని, పాములను వేటాడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వివరాలను మాలిక్యూల్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.