హైదరాబాద్: ఇటీవల యూపీఐ లావాదేవీలు ఎక్కువైపోయాయి. అందరూ యూపీఐ ద్వారానే బిల్లులు కట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొత్త రూల్స్(UPI Rule Change) తీసుకొచ్చింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవి అమలులోకి రానున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ లావాదేవీలను పటిష్టంగా నిర్వహించేందుకు కొత్త సెక్యూర్టీ చర్యలు చేపట్టారు. యూపీఐతో లింకున్న ఇన్‌యాక్టివ్ నెంబర్లను డీయాక్టివేట్ చేయనున్నారు. చాన్నాళ్ల నుంచి తమ మొబైల్ నెంబర్‌ను యూపీఐ లావాదేవీలకు వాడని వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీలోగా ఆ వివరాలను తమ బ్యాంక్ వద్ద అప్డేట్ చేసుకుంటే, యూపీఐ సర్వీసులకు అంతరాయం ఉండదు. సెక్యూర్టీ సమస్య రాకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న ఇన్‌యాక్టివ్ నెంబర్లను బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి థార్టీ పార్టీ యూపీఐ ప్రొవైడర్లు తీసివేయాల్సి ఉంటుంది.
ఇక కనీస బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు లాంటి బ్యాంకులు.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీనిమం బ్యాలెన్స్ రూల్స్‌ను మార్చుతున్నాయి. కనీస బ్యాలెన్స్ మెంటేన్ చేయని కస్టమర్లకు జరిమానా విధించనున్నారు.
కొత్త ఆదాయపన్ను చట్టం ప్రకారం 12 లక్షలు ఆదాయం వరకు పన్ను విధించబోరు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమలులోకి రానున్నది. 2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానున్నది. ఈ స్కీమ్‌తో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షర్లకు లాభం చేకూరనున్నది. కొన్ని బ్యాంకులు క్రెడట్ కార్డు రివార్డు పాయింట్ల విధానాన్ని మార్చనున్నారు.