Two Wheeler | తిరువనంతపురం, జూలై 28: రోడ్డు ప్రమాదాల నివారణకు కేరళ మోటారు వాహనాల శాఖ(ఎంవీడీ) కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇక నుంచి ద్విచక్ర వాహనం నడిపే వారు వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం శిక్షార్హమైన నేరం. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు ఆదేశాలు అందాయి. వెనుక కూర్చున్న వారితో ముచ్చట్లలో మునిగిపోతూ బైక్ నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన తర్వాతే ఈ నిబంధనను విధించినట్టు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే మనోజ్ కుమార్ తెలిపారు.
వెనుక ఉన్న వారితో మాట్లాడేందుకు బైక్ నడిపే వారు తల తిప్పడం, ఒకవైపు మళ్లడం వల్ల వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్పారు. ఈ నిబంధనను ఉల్లంఘించి, బైక్ నడిపే సమయంలో వెనుక కూర్చున్న వారితో మాట్లాడే వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు. అయితే, జరిమానా ఎంత అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.