న్యూఢిలీ, జూన్ 15: నీట్ అభ్యర్థులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నీట్ యూజీ ఎగ్జామ్ లీక్ కావడంతో ఈ నెల 21న రీటెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడంలో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని చాలా మంది స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వివరాలు ఎంటర్ చేస్తుండగా సమస్యలు వస్తున్నాయని, బ్లర్‌గా కనిపిస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. ఇప్పటి వరకు 4 లక్షల మంది అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని.. కొందరికి మాత్రమే అలాంటి సమస్య వస్తున్నదని చెప్పింది.
ఒకేసారి ఎక్కువ మంది పోర్టల్ యాక్సెస్‌లో ఉండగా ఈ సమస్య వచ్చిందని చెప్పింది. టెక్నికల్ సమస్యలపై వర్క్ జరుగుతున్నదని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరింది. బ్యాంకు వివరాలు నమోదు చేసే సమయంలోనే ఎక్కువగా ఈ సమస్య వస్తున్నదని.. అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోక ముందే ఫీజు రిఫండ్ కోసం ఆ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలని ఎన్టీయే సూచించింది.
బీహార్‌కు చెందిన 19 ఏండ్ల యువకుడు ‘నీట్-యూజీ’ పోర్టల్‌లో చొరబడి.. అభ్యర్థుల రిఫండ్ మొత్తాన్ని కాజేశాడు. భద్రతా లోపాలు, బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఆసరాగా చేసుకొని.. అభ్యర్థుల ఖాతాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో అహ్మదాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ గయ జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ (19) అనే నిందితుడ్ని అరెస్టు చేసినట్టు సోమవారం మీడియాకు తెలిపారు.
సుమారు 150 మంది నీట్ అభ్యర్థుల ఖాతాలను చట్టవిరుద్ధంగా యాక్సెస్ పొంది, వారికి చెందాల్సిన రిఫండ్ మొత్తాలను తన బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించినట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో విద్యార్థికి రావాల్సిన రూ.1,700 రిఫండ్ మొత్తాన్ని తన ఖాతాలోకి తరలించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నీట్ పరీక్షా విధానంపై తీవ్ర పరిశీలన జరుపుతుండగా ఈ బాగోతం వెలుగుచూసింది.