న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరి నాటికి క్యూఆర్ కోడ్‌తో ఈ-ఆధార్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రయత్నిస్తున్నది. దీనివల్ల ప్రజలు తమ గుర్తింపును డిజిటల్ స్కాన్ ద్వారా తనిఖీ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది అమల్లోకి వస్తే, జిరాక్స్ కాపీలు, పత్రాలను ఉపయోగించవలసిన అవసరం ఉండదు. ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు సేవల కోసం క్యూఆర్ కోడ్‌తో తమ గుర్తింపును ధ్రువీకరించుకోవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష ఆధార్ ఆథెంటికేషన్ మెషిన్స్ పని చేస్తున్నాయని యూఐడీఏఐ సీఈఓ భువనేశ్ కుమార్ చెప్పారు. వీటిలో దాదాపు 2,000 మెషిన్స్ను అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఆధార్ మొబైల్ యాప్‌ను కూడా రీడిజైన్ చేస్తున్నారు. ఆధార్ హోల్డర్ తన పేరు, చిరునామా, జనన తేదీ, వంటి ప్రొఫైల్ అప్డేట్స్ను తన ఫోన్లోని ఈ యాప్ ద్వారానే చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు.