తిరువనంతపురం: కేరళలోని కాసర్గోడ్ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని సరస్సులో కొత్తగా మరో ఒంటరి మొసలి కనిపించింది. ఆ ఆలయంలో సంచరించిన దశాబ్దాల నాటి శాఖాహార మొసలి (Vegetarian Crocodile) మరణించిన ఏడాది తర్వాత కొత్తగా ఇది కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నవంబరు 8న సరస్సు వెంబడి ఉన్న గుహలో ఒక మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. దీని గురించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం ఆ కొత్త మొసలిని పరిశీలించారు. ఇది చిన్నదని ఆలయ అధికారులు తెలిపారు. కొత్తగా కనిపించిన ఒంటరి మొసలి గురించి ప్రధాన పూజారికి సమాచారం ఇచ్చామని చెప్పారు. ఏమి చేయాలి అన్నది ఆయన నిర్ణయిస్తారని వెల్లడించారు.
కాగా, ఆ ఆలయంలోని సరస్సులో ఎప్పుడూ ఒక్క మొసలి మాత్రమే ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. అది చనిపోయిన తర్వాత మరో ఒంటరి మొసలి కనిపిస్తుందని చెప్పారు. కొత్తగా కనిపించిన మొసలి నాల్గవదని వెల్లడించారు. ‘ఒక మొసలి చనిపోయిన తర్వాత మరొకటి అనివార్యంగా సరస్సులో కనిపిస్తుంది. ఇది వివరించలేని పరిణామం’ అని ఆలయ వెబ్సైట్లో పేర్కొన్నారు.
Vegetarian Crocodile Death
మరోవైపు ఆ ఆలయంలోని సరస్సులో 70 ఏళ్లకు పైగా జీవించిన మూడవ ఒంటరి మొసలి కేవలం ప్రసాదం తిని బతికింది. ఆలయం ప్రాంగణంలో సంచరిస్తూ భక్తులకు ఎలాంటి హాని తలపెట్టని ఆ మొసలిని బాబియా అని పిలిచేవారు. ఆ శాఖాహార మొసలి 2022 అక్టోబర్ 9న చనిపోయింది. అయితే దానిని పూడ్చి వేసే ముందు కడసారి చూసేందుకు వేలాది మంది భక్తులతోపాటు రాజకీయ నేతలు ఆ ఆలయానికి తరలివచ్చారు.