వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఉచిత ఆధార్ అప్డేట్కు జూన్ 14 చివరి తేదీ
ఇకపై ప్రైవేట్ కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్
న్యూఢిల్లీ, మే 28: వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకొనేందుకు జూన్ 14ను యూఐడీఏఐ చివరి తేదీగా నిర్ణయించింది. ఆ తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే జూన్ 14 తర్వాత అప్డేట్ చేసుకోని వారి పాత కార్డు పనిచేయకుండా పోతుందన్న ప్రచారాన్ని యూఐడీఏఐ ఇటీవల ఖండించింది.
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్-2024 అమల్లోకి రానున్న క్రమంలో వచ్చే నెల 1 నుంచి ట్రాఫిక్స్ రూల్స్‌లో మార్పులు జరుగనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. అధిక వేగానికి రూ.1-2 వేలు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.100 ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ డ్రైవింగ్ చేస్తే రూ.25 వేల భారీ జరిమానా విధించడంతోపాటు అతనికి 25 ఏండ్ల వయసు వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉండదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు.
ఆర్బీఐ విడుదల చేసిన లిస్టు ప్రకారం జూన్‌లో బ్యాంకులకు 10 రోజుల సెలవులు ఉన్నాయి. వీటిలో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు ఉన్నాయి. మిగతా సెలవుల్లో రాజా సంక్రాంతి, ఈద్-ఉల్-ఆధా పండుగలు ఉన్నాయి.