Aadhaar | న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డునో లేక దాని జిరాక్స్ కాపీనో మనం వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఇక ఉండదు. గుర్తింపు ధ్రువీకరణను సురక్షితంగా, డిజిటల్‌గా, పేపర్ రహితంగా చేయడానికి రూపొందించిన ఆధార్ యాప్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు.
క్యూఆర్ కోడ్‌తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ముఖ ధ్రువీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. 100 శాతం డిజిటల్ విధానంలో పనిచేస్తుంది కాబట్టి ఇక నుంచి వినియోగదారులు ఆధార్ ఫొటో కాపీలు, ప్లాస్టిక్ కార్డులు తమ వెంట తీసుకుని వెళ్లనక్కర్లేదు.
ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే దేశమంతటా ప్రవేశపెడతారు. ఇది అమలులోకి వస్తే ఇక నుంచి ఎయిర్‌పోర్టులు, హోటళ్లు, ప్రభుత్వ సేవలు, ఇతర ప్రదేశాల్లో భౌతిక ఆధార్ కార్డులను ఐడీ ధ్రువీకరణగా చూపించాల్సిన అవసరం ఉండదు. స్కానింగ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణమే ఆధార్ ధ్రువీకరించుకోవచ్చు